ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి*

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి*

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ 09-10-2026 శుక్రవారం వసతి గృహాల్లో విద్యార్థినుల ఆరోగ్యం, ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. పెబ్బేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని బీసీ బాలికల వసతి గృహంలో బుధవారం రాత్రి విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం వసతి గృహాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత, తాగునీరు, వసతి గృహంలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలపై సంబంధిత అధికారులు, విద్యార్థినులను విచారించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారులు స్పందిస్తూ మొత్తం 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు, వారందరినీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్‌కు వివరించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహంలో బుధవారం రాత్రి చికెన్ తో భోజనం చేసిన అనంతరం కొందరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఈ ఘటనకు ఆహారం కలుషితం కావడం కారణమై ఉండవచ్చని తెలిపారు. అనారోగ్యానికి గురైన విద్యార్థినులకు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వసతి గృహంలో తాగునీటి శుద్ధి యంత్రానికి సంబంధించిన ఫిల్టర్‌ను వెంటనే మార్చించాలని, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రతను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థినులకు భోజనం వడ్డించే ముందు సంబంధిత అధికారులు తప్పనిసరిగా ఆహారాన్ని రుచి చూసి, నాణ్యతపై పూర్తి నమ్మకం కలిగిన తర్వాతే వడ్డించాలని కలెక్టర్ సూచించారు. వసతి గృహాల్లో విద్యార్థినుల ఆరోగ్యం, ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులకు సురక్షితమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారిని ప్రమీల, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి ద్వారా జారీ.

ఇ-పేపర్