జనం న్యూస్ | : బీహార్లోని జముయ్లో యువజంటపై కొందరు వ్యక్తులు రాత్రివేళ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఓ యువతిని ఓ వ్యక్తి ఎత్తుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, ఆమె స్నేహితుడు అడ్డుకున్నట్లు కనిపిస్తోంది. అనంతరం బైక్పై కూర్చున్న యువజంటను చుట్టుముట్టిన గుంపు వారిని వేధించినట్లు వీడియోలో కనిపించింది. తమను వదిలేయాలని యువజంట చేతులు జోడించి వేడుకోవడం, యువకుడు తనతో ఉన్న యువతిని గుంపు నుంచి కాపాడేందుకు ప్రయత్నించడం వంటి దృశ్యాలు కూడా వైరల్ వీడియోలో ఉన్నాయి. యువతిని ఎత్తుకెళ్లే సమయంలో ఓ వ్యక్తి ఆమెను అనుచితంగా తాకినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే వైరల్ అవుతున్న వీడియో నిజమైనదేనా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేమిటనే అంశంపై అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది. వీడియోను షేర్ చేసిన ఓ ఎక్స్ ఖాతా.. ఘటన నిజమని, ఇందులో పాల్గొన్న వ్యక్తులను గుర్తిస్తే బీహార్ పోలీసులు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇలాంటి ఘటనలు బహిరంగంగా జరుగుతున్న సమయంలో అక్కడున్న వారు అడ్డుకోకుండా వీడియోలు చిత్రీకరించడంపై కూడా ఆ పోస్టులో ప్రశ్నలు లేవనెత్తారు. వైరల్ వీడియో ఆధారంగా బీహార్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. జముయ్ పోలీసు సూపరింటెండెంట్ కూడా ఈ వీడియో జముయ్–లఖిసరాయ్ రహదారికి సంబంధించినదిగా నిర్ధారించినట్లు హిందీ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తుల గుర్తింపు, తదుపరి పోలీసు చర్యలపై దర్యాప్తు అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.