ముత్యాల సునీల్ కుమార్‌పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు జనం న్యూస్ నవంబర్ 18:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్,మండల మాజీ అధ్యక్షులు సోమ దేవరెడ్డి మాట్లాడుతూ. ఇసుక మాఫియా గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇసుక వ్యాపారంపై గుత్తాధిపత్యం ఎవరి చేతుల్లో ఉండేదో ప్రజలకు తెలుసని, అప్పటి ఇసుక దందాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హయాంలో ఇసుక వ్యాపారంలో అక్రమాలు, కమిషన్ల ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. గతంలో ఇసుక ద్వారా లబ్ధి పొందిన నాయకులు నేడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక పాయింట్ల వద్ద అన్ని పార్టీలకు చెందిన ట్రాక్టర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తల ట్రాక్టర్లు సైతం ఇసుక పాయింట్ల వద్ద నడుస్తున్నాయని, వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజకీయ విమర్శలను స్వాగతిస్తామని, అయితే వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో మీ పాలనలో ఇసుక వ్యాపారం ఎలా సాగిందో, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో ఎలా కొనసాగుతుందో ప్రజలకు తెలుసని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు, అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, సొసైటీ చైర్మన్, మాజీ కేఎంసీ డైరెక్టర్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, ఆలయ కమిటీ చైర్మన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.