ఆంధ్రప్రదేశ్

కొత్త రాజోలి గ్రామ సమస్యలపై స్పందిద్దాం మన హక్కులను కాపాడుకుందాం మన గ్రామ అభివృద్ధి కోసం ప్రశ్నిద్దాం

కొత్త రాజోలి గ్రామ సమస్యలపై స్పందిద్దాం మన హక్కులను కాపాడుకుందాం మన గ్రామ అభివృద్ధి కోసం ప్రశ్నిద్దాం

జనం న్యూస్ 23 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్కొ త్త రాజోలి అభివృద్ధి చెందితేనే భావితరాలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది.మన గ్రామంలో నివసిస్తున్న ప్రజల సమస్యలను మనమే ప్రశ్నించాలి. మన హక్కుల కోసం మనమే గొంతెత్తాలి. అధికారులు, పాలకవర్గం స్పందించేలా ప్రజాస్వామ్య పద్ధతిలో మన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లాలి.కొత్త రాజోలి గ్రామ ప్రజల ప్రధాన సమస్యలు చెత్త సేకరణ సమస్య గ్రామంలో చెత్త సేకరణ బండి నెలకు కేవలం రెండుసార్లు మాత్రమే రావడం వల్ల ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్త పేరుకుపోతోంది. దీంతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. చెత్త సేకరణ బండి ప్రతిరోజూ లేదా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వచ్చేలా చర్యలు తీసుకోవాలి.2. వీధి కుక్కల బెడద కొత్త రాజోలిలో ఏ కాలనీకి వెళ్లినా వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. మహిళలు, విద్యార్థులు, చిన్నపిల్లలు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. ఇప్పటికే కుక్కల వల్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి. 3. పందుల బెడద గ్రామంలోని కాలనీల్లో పందుల సంచారం విపరీతంగా పెరిగిపోయింది. ఇళ్ల ముందు ఉంచిన వస్తువులు, ఆహార పదార్థాలను చిందరవందర చేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నాయి. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా పందుల నియంత్రణకు చర్యలు చేపట్టాలి.4. ప్రధాన రహదారిపై వీధి దీపాల ఏర్పాటు పాత ఎస్సీ కాలనీ నుంచి ఆర్.డి.టి.ఎస్ కాలనీ వరకు ఉన్న ప్రధాన రహదారికి ఇరువైపులా సరైన వీధి దీపాలు లేవు. రాత్రివేళ పూర్తిగా చీకటి అలుముకుంటోంది. ఈ చీకటి కారణంగా రహదారిపై ప్రమాదాలు జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ స్తంభాలకు శక్తివంతమైన యల్ ఇ డి లైట్లు ఏర్పాటు చేయాలి.5. మిషన్ భగీరథ నీటి నాణ్యత కొత్త రాజోలిలో మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై ప్రజల్లో ఆందోళన ఉంది. నీరు పరిశుభ్రంగా సరఫరా అయ్యేలా అధికారులు నాణ్యత పరీక్షలు నిర్వహించి, లోపాలను సరిచేయాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. 6. కస్తూర్బా బాలికల పాఠశాల డ్రైనేజీ సమస్య కొత్త రాజోలిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పూర్తిస్థాయి డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ప్రస్తావించినా పరిష్కారం కనిపించడం లేదు. విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలి. 7. మురుగునీటి పారుదల సమస్య కొత్త రాజోలిలో ప్రజలు నివసించే అనేక కాలనీల్లో మురుగునీటిని రోడ్లపైనే వదులుతున్నారు. దీంతో దుర్వాసన, దోమలు, అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. గ్రామపంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన చోట డ్రైనేజీ కాలువలు నిర్మించాలి. సాధ్యం కాని ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.8. కాలనీల్లో సరైన వీధి దీపాలు గ్రామంలోని అనేక కాలనీల్లో ఉన్న వీధి దీపాలు చాలా చిన్నవిగా, తక్కువ వెలుతురు ఇచ్చే విధంగా ఉన్నాయి. రాత్రివేళ వాటివల్ల ప్రజలకు ఆశించిన ప్రయోజనం కలగడం లేదు. వాటి స్థానంలో పెద్ద యల్ ఇ డి బల్బులను ఏర్పాటు చేయాలి.9. సోలార్ స్తంభాల వద్ద విద్యుత్ ప్రమాదాలు గతంలో గ్రామంలోని కాలనీల్లో ఏర్పాటు చేసిన సోలార్ స్తంభాల సమీపంలో విద్యుత్ కనెక్షన్ వైర్లు ఉండటంతో గాలివానల సమయంలో వైర్లు స్తంభాలకు తగిలే ప్రమాదం ఉంది. దీనివల్ల విద్యుత్ షాక్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ అధికారులు వెంటనే పరిశీలించి ప్రమాదకరమైన వైర్లను సరిచేయాలి. 10. తాత్కాలిక బస్ స్టాప్, మహిళలకు టాయిలెట్ల ఏర్పాటు కొత్త రాజోలిలో కనీసం ఒక తాత్కాలిక బస్ స్టాప్ కూడా లేకపోవడం వల్ల ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే మహిళల ఆత్మగౌరవం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి. 11. చేనేత కార్మికులకు తాగునీటి సౌకర్యం చేనేత కార్మికుల జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు చెందిన పి.డి. అగర్వాల్ దాతలు లక్షల రూపాయలు ఖర్చు చేసి మగ్గాల షెడ్లను నిర్మించారు. అక్కడ ప్రతిరోజూ సుమారు 50 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. అలాంటి కార్మికులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం బాధాకరం. వెంటనే మగ్గాల షెడ్ల వద్ద తాగునీటి సౌకర్యం కల్పించాలి. 12. కొత్త రాజోలిలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు మన గ్రామానికి ప్రభుత్వ కార్యాలయాలు మంజూరైనప్పుడు కొత్త రాజోలి ప్రాంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు, పాలకవర్గం గుర్తించాలి. ప్రజలకు అందుబాటులో ఉండేలా కొత్త రాజోలిలో కూడా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు కృషి చేయాలి.13. విద్యార్థులకు ప్రత్యేక రవాణా సౌకర్యం కొత్త రాజోలిలోని విద్యార్థులు పాత గ్రామంలోని పాఠశాలలకు వెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పాఠశాల సమయాల్లో ప్రత్యేక వాహన సౌకర్యం కల్పించాలి. విద్యార్థుల రాకపోకలకు భద్రత కల్పించడం గ్రామపంచాయతీ బాధ్యతగా గుర్తించాలి.14. ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు కొత్త రాజోలిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. విషపూరిత జంతువులు, పాములు కరిచినప్పుడు అవసరమైన మందులు, యాంటీవెనమ్ వంటి అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలి. తద్వారా మన గ్రామంతో పాటు చుట్టుపక్కల పల్లెల ప్రజలకు కూడా మెరుగైన వైద్య భరోసా కల్పించవచ్చు.15. మొక్కల సంరక్షణ, ప్రమాదకరమైన గుంతల పూడ్చివేత కొత్త రాజోలిలోని వివిధ కాలనీల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటినప్పటికీ వాటికి సరైన నీటి సౌకర్యం కల్పించకపోవడంతో చాలా మొక్కలు ఎండిపోయాయి. అంతేకాకుండా మొక్కలు నాటేందుకు రోడ్ల పక్కన తవ్విన గుంతలు అలాగే ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. ప్రమాదకరమైన గుంతలను వెంటనే పూడ్చివేయాలి. 16. రెండు గ్రామాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వండి! కొత్త రాజోలి గ్రామ ప్రజలు కోరుకునేది ఒక్కటే. అధికారులు, పాలకవర్గం రెండు గ్రామాలను సమాన దృష్టితో చూడాలి.గ్రామ నిధుల కేటాయింపులో అభివృద్ధికి నోచుకోని కొత్త రాజోలికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రభుత్వ సదుపాయాలు నిర్మించే అవకాశం వచ్చినప్పుడు కొత్త రాజోలిని కూడా ఎంపిక చేయాలి.ఎన్నికల సమయంలో ప్రజల ఓట్లు మాత్రమే తీసుకొని, అభివృద్ధి విషయానికి వచ్చేసరికి కొత్త గ్రామాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసం
గ్రామసభల్లో ఎన్నిసార్లు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండటం బాధాకరం.ప్రజలారా.. ఒక్కసారి ఆలోచించండి! మన గ్రామ సమస్యలను మనం ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు మన హక్కుల కోసం మనం నిలబడకపోతే ఎవరు నిలబడతారు ఈరోజు మనం మౌనంగా ఉంటే రేపు మన పిల్లలు మన భావితరాలు కూడా ఇదే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కొత్త రాజోలి గ్రామ ప్రజలందరూ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు రావాలి. ప్రతి గ్రామసభలో మన సమస్యలను లిఖితపూర్వకంగా అధికారులకు అందజేయాలి. వాటి పరిష్కారం కోసం ప్రశ్నించాలి.ప్రశ్నించడం మన హక్కు అభివృద్ధి సాధించడం మన బాధ్యత ప్రశ్నించే గొంతుకలు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అవుతుంది. కొత్త రాజోలి అభివృద్ధి మనందరి లక్ష్యం కావాలి.

ఇ-పేపర్