క్రైమ్ వార్తలు

దంపతులపై స్కెచ్ వేశారు.. కానీ అడ్డంగా బుక్ అయిపోయారు (వీడియో చుడండి)

దంపతులపై స్కెచ్ వేశారు.. కానీ అడ్డంగా బుక్ అయిపోయారు (వీడియో చుడండి)

జనం న్యూస్ | : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులు స్థానికులకు చిక్కిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 12న రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రహదారిపై రిటైర్డ్ డాక్టర్ తన భార్యతో కలిసి యాక్టివాపై వెళ్తుండగా, ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వారి వాహనం పక్కకు వచ్చారు. వెనుక కూర్చున్న వ్యక్తి డాక్టర్ భార్య మెడలోని బంగారు గొలుసును బలంగా లాగేందుకు ప్రయత్నించడంతో దంపతులు అదుపుతప్పి యాక్టివా నుంచి కిందపడిపోయారు. వెంటనే చైన్ స్నాచర్లు తమ వాహనాన్ని ఆపగా, వారిలో ఒకరు వెనక్కి పరిగెత్తి కిందపడిపోయిన మహిళ మెడలోని గొలుసును లాక్కుని పరారయ్యేందుకు ప్రయత్నించాడు. మరో నిందితుడు బైక్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అతడిని పట్టుకున్నాడు. అదే సమయంలో గొలుసుతో పారిపోతున్న వ్యక్తిని మరో ముగ్గురు స్థానికులు వెంబడించి పట్టుకుని అక్కడికి తీసుకొచ్చారు. ఈ మొత్తం ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు తెలుస్తోంది. అనంతరం ఇద్దరు నిందితులను స్థానికులు పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. నిందితులను పట్టుకున్న స్థానికులు వారికి దేహశుద్ధి చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. సులభంగా, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో బాధితులు కిందపడటంతో ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇ-పేపర్