జనం న్యూస్ నవంబర్ 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం కోనేరు నిర్మాణ పనులను ప్రారంభించారు. నిర్మాణ పనుల్లో భాగంగా పునాది తవ్వకం, కంకర పరిచే పనులకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. ఆలయ గురుస్వామి శ్రీ సౌడల వినోద్ గురుస్వామి ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ రాకేష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. వేదమంత్రాలు, పూజా కార్యక్రమాల నడుమ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కోనేరు నిర్మాణానికి చంద్రం అనసూయ, రాములు గౌడ్ దాతలుగా ముందుకు వచ్చారు. ఆలయ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం పట్ల భక్తులు అభినందనలు తెలియజేశారు.