ఆర్టీసీలో వేలాడుతున్న ప్రయాణికులు
జనం న్యూస్ జూన్ 25 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలంలోని పల్లం గ్రామం నుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడకు ప్రతిరోజు వెళ్లే ఆర్టీసీ బస్సు లో ప్రయాణికులు వేలాడుతూ వెళ్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులుఎక్కుతున్నారు. దీంతో ఫుట్ పాత్ పై వేలాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో ఒక మహిళ ఫుట్ పాత్ నుండి క్రిందికి పడిపోయింది. స్థానికులు ఆమెను ఆసుపత్రిలోజాయిన్ చేశారు. ఆమెకు కాల్ విరిగిపోయింది. ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కళాశాలలకు వెళ్లే విద్యార్థిని, విద్యార్థులు ఈ బస్సు ఫుట్ పాత్ పై ప్రయాణం చేస్తున్నారు.ఈ బస్సు పల్లం లో బయలుదేరినప్పుడే ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. కొంతమంది ప్రయాణి కులకు చెందిన చేపల లోడు, ఇతర సామగ్రితో బస్సు నిండు పోతుంది. మండల కేంద్రమైన కాట్రేనికోన గేట్ సెంటర్ కు వచ్చేసరికి మరింత మంది ప్రయాణికులు ఈ బస్సు పై ఆధారపడుతుంటారు. కాలేజీలు, ఆసుపత్రులు, ఇతర పనుల నిమిత్తం ఉమ్మడి జిల్లా కేంద్రమైన కాకినాడకు ప్రతిరోజు మండలంలోని పలు ప్రాంతాల నుండి ప్రయాణికులు కాకినాడ వెళుతుంటారు. వీరంతా ఈ బస్సు పైనే ఆధారపడు తుంటారు. ముఖ్యంగా ఆసుపత్రికి వెళ్లే రోగులు ఈ బస్సులో ప్రయాణం చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పల్లంకుర్రు నుండి రాజమండ్రి వెళ్లే సర్వీస్ ను ఆర్టీసీ రద్దు చేసింది. ఈ బస్సు కోసం వేచి ఉండే ప్రయాణికులు కూడా మహిపాలా చెరువు వరకు కాకినాడ బస్సు పైనే ఆధారపడుతున్నారు. పల్లంకుర్రు నుండి కాకినాడకు మరో అదనపు బస్సును ఉదయం వేళలో నడపాలి అన్న డిమాండ్ మండల ప్రజల నుండి వినిపిస్తుంది. ఈ విషయమై స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు చొరవ చూపాలని వీరు అభిప్రాయపడుతున్నారు.