కాంగ్రెస్ అసత్య ప్రచారంపై బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్

August 7, 2026 | తెలంగాణ

జనం న్యూస్ | ఏర్గట్ల | ఆగస్టు 7:డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ మండల నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఏర్గట్లలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై కమిషన్ల పేరుతో ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం కాంగ్రెస్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే లక్ష్యంతో డబుల్ బెడ్‌రూమ్ గృహ పథకాన్ని అమలు చేసి వేలాది కుటుంబాలకు ఇళ్లు అందించామని తెలిపారు. ఏర్గట్ల మండలంలో సాంకేతిక కారణాలతో కొన్ని గృహాలు పెండింగ్‌లో ఉండగా, వాటిని పూర్తి చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్‌పై ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాల్సిందిపోయి గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అన్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ప్రజలకు తెలుసని, వాటిని ఎంత వక్రీకరించినా ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.వ్యక్తిగత విమర్శలు మానుకుని ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. అసత్య ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని, లేకుంటే ప్రజలే తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏనుగందుల రాజా పూర్ణానందం, ఏర్గట్ల సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుళ్ళే రాజేశ్వర్, మాజీ సర్పంచ్లు,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper