గుంతలమయంగా మారిన అంతర్రాష్ట్ర రోడ్లు – ప్రభుత్వం ఏం చేస్తోం

September 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్ 10. 09. 2026 మాజీ తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తం***జహీరాబాద్:జహీరాబాద్ నియోజకవర్గాన్ని కర్ణాటకలోని బీదర్‌తో కలిపే జహీరాబాద్–బీదర్ రహదారి అత్యంత ముఖ్యమైన అంతర్రాష్ట్ర రహదారి. ప్రతిరోజూ భారీ సంఖ్యలో ప్రయాణికులు, ఆర్టీసీ బస్సులు, సరుకు రవాణా వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ ప్రస్తుతం రహదారి గుంతలతో నిండిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అదేవిధంగా గంగ్వార్–అల్లాదుర్గ్ రహదారి కూడా తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాలను కలిపే కీలకమైన మార్గం. జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి ప్రాంతాల మీదుగా హైదరాబాద్‌ను కర్ణాటకలోని బీదర్‌తో అనుసంధానించే ఈ రహదారి పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉందని నరోత్తం అన్నారు.“కొత్త రోడ్లు వేయడం ఆలస్యం అయితే కనీసం గుంతలనైనా పూడ్చలేరా? ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాలా?” అని ఆయన ప్రశ్నించారు.రోడ్లపై ఏర్పడిన భారీ గుంతల కారణంగా వాహనాలు దెబ్బతినడంతో పాటు ప్రమాదాల ముప్పు కూడా పెరిగిందని అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లాకు ఒక క్యాబినెట్ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, జిల్లాలోని ప్రధాన అంతర్రాష్ట్ర రహదారుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఆ పదవి వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమిటని నరోత్తం ప్రశ్నించారు.పరిశ్రమలు, NIMZ, వాణిజ్య కార్యకలాపాల అభివృద్ధికి మెరుగైన రహదారులు అత్యంత కీలకమని, ఇలాంటి ముఖ్యమైన రహదారులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాంత అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతుందని అన్నారు.ప్రభుత్వం ఇకనైనా జహీరాబాద్–బీదర్, గంగ్వార్–అల్లాదుర్గ్ రహదారులను వెంటనే పరిశీలించి, ప్రమాదకరమైన గుంతలను యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని, అవసరమైన చోట్ల పూర్తి స్థాయిలో కొత్త రోడ్లు నిర్మించాలని వై. నరోత్తం డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మాజీ తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తంతో పాటు గోపాల్, బలరాజ్, మల్లేశ్ తదితరులు పాల్గొని రహదారుల దుస్థితిని పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

🌐 Select Language:
📰 ePaper