దుర్వాసన, దోమల బాధ నుంచి కాపాడండి.. మున్సిపల్ అధికారులకు స్థానికుల విజ్ఞప్తి
జనం న్యూస్ | ఆగస్టు 5 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డికూకట్‌పల్లి వెంకట్రావు నగర్ కాలనీలోని స్మశానవాటిక ఎదురుగా ఉన్న స్క్రాప్ షాప్ వెనుక ఖాళీ స్థలం ప్రస్తుతం చెత్త డంపింగ్ కేంద్రంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు భారీ మొత్తంలో చెత్తను అక్కడ పడేస్తుండటంతో పరిసర ప్రాంతం దుర్వాసనతో నిండిపోతోందని వారు చెబుతున్నారు.ఆ చెత్త పేరుకుపోవడంతో దోమలు అధికంగా పెరిగి, స్క్రాప్ షాప్‌కు ఆనుకుని ఉన్న అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఖాళీ స్థలంలో చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే స్క్రాప్ షాప్‌ను తొలగించి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.