ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్ పై ప్రత్యేక శిక్షణ
బిచ్కుంద జూన్ 19 జనం న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న–అక్క మెంటార్షిప్ కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), అధ్యాపకులు, విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ లెర్నింగ్ అంశాలపై రెండు రోజుల శిక్షణా తరగతులు ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ కె .అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కళాశాల విద్యార్థులు చదువుకుంటూనే పాఠశాల విద్యార్థులకు కృత్రిమ మేధస్సు పాఠాలను బోధించడం గొప్ప అభ్యసన ప్రక్రియ అని అన్నారు. తాము నేర్చుకున్న అంశాలను ఇతరులకు బోధించడం ద్వారా విద్యార్థులకు ఏఐపై మరింత పట్టు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని తృతీయ సంవత్సరం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్న–అక్క మెంటార్షిప్ కార్యక్రమంలో భాగంగా తృతీయ సంవత్సరం విద్యార్థులు 15 రోజుల పాటు రోజుకు రెండు గంటల చొప్పున మొత్తం 30 గంటలు సమీప ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కృత్రిమ మేధస్సు అంశాలను బోధించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు రెండు క్రెడిట్ మార్కులతో పాటు ప్రత్యేక సర్టిఫికెట్ కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు.మాస్టర్ ట్రైనర్ వేణుగోపాల్ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఉపయోగించి వివిధ రంగాల్లో నైపుణ్యాలను ఎలా పెంపొందించుకోవచ్చో ఆయన విద్యార్థులు, అధ్యాపకులకు వివరించారు.ఈ కార్యక్రమానికి కళాశాల నోడల్ అధికారులైన డా . వై.సంజీవరెడ్డి, వై.రేవతి, కె.అశ్వినీ అలాగే వైస్ ప్రిన్సిపల్ డా, జి . వెంకటేశం,అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ టి. హన్మండ్లు, ఐ క్యూ ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ జి.రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.