ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి తెలంగాణ పౌరుడు కృషి చేయాలి: బండి రమేష్
జనం న్యూస్ జూన్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ పాత్ర అసామాన్యమైనదని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుతూ ఆశయాలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ 15వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. పార్టీ నాయకుడు నర్సింగరావు ఆధ్వర్యంలో మూసాపేట ఆంజనేయ నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి బండి రమేష్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దిశానిర్దేశం చేశారని, ఆయన చూపిన చొరవ, అవలంబించిన సిద్ధాంతాలు, వేసిన బాట కారణంగానే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. తెలంగాణ ఆవిర్భావం వెనుక జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని బండి రమేష్ పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, సాయిబాబా చౌదరి, మదన్‌మోహన్, అస్లాం, సుజాత, వాణి, శ్రీనివాస బాబు, రవి, నరేందర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.