మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి
జనం న్యూస్, ఆగష్టు 06,అచ్యుతాపురం:మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఈరోజు అచ్యుతాపురం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చదివి టెట్,డిఏస్సీ , బి.ఎడ్ పూర్తి చేసి, మెరిట్‌తో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలని కలలు కన్న వేలాది మంది నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తీవ్రంగా విమర్శించారు.ప్రభుత్వం ప్రకటించిన “మెగా డిఎస్సీ నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించినా, చివరకు అది దగా డిఎస్సీగా మారిందని,అర్హత, మెరిట్ ఉన్న అభ్యర్థులను పక్కనబెట్టి, డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలు రావడం వల్ల నిజాయితీగా పరీక్ష రాసిన అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.బి.ఎడ్ పూర్తి చేసి, టెట్ అర్హత సాధించి, డిఎస్సీ కోసం సంవత్సరాలు గా సిద్ధమైన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసిన సమయంలో ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి కుటుంబం తమ పిల్లల భవిష్యత్తు కోసం చేసిన త్యాగాలను ప్రభుత్వం గౌరవించకుండా, అర్హత కంటే అవకతవకలకు ప్రాధాన్యం ఇచ్చిందనే భావన రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిందన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరపాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని, నిజాయితీగా పరీక్ష రాసిన అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన 3,000 నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని,డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలాడితే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు.
