మద్దూర్ ఎస్సై విజయ్‌కుమార్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు
జనం న్యూస్ 20 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గత ఆరోపణలు మళ్లీ చర్చనీయాంశం.. శాఖలో క్రమశిక్షణపై ప్రశ్నలు మద్దూర్: నారాయణపేట జిల్లా మద్దూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై విజయ్‌కుమార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. సొంత శాఖలో పనిచేస్తున్న మహిళా పోలీసు సిబ్బంది నిహారిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కావడంతో, జిల్లా ఎస్పీ ఆయనను వెంటనే వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా మద్దూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ బాధ్యతలను కోస్గి ఎస్సై శ్రీనివాసులకు అప్పగించారు.ట్రైనింగ్ సమయంలో పరిచయం.. వేధింపుల ఆరోపణలుఫిర్యాదు వివరాల ప్రకారం, వరంగల్ జిల్లాకు చెందిన డి. నిహారికకు ఎస్సై ట్రైనింగ్ సమయంలో విజయ్‌కుమార్ పరిచయం అయ్యాడు. అనంతరం ఆమెపై వ్యక్తిగత సంబంధం కోసం పలుమార్లు ఒత్తిడి తెచ్చాడని, తన వద్ద నుంచి రూ.1.20 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆరోపించింది.అలాగే తన వివాహ సమయంలో ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడని, 2025లో ఇంటికి వచ్చి అనుచితంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపిన నిహారిక, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.ఈ కేసులో,ఎస్సై,విజయ్‌కుమార్‌పై భారతీయ న్యాయ సంహిత (బి ఎన్ ఎస్ ) సెక్షన్లు 78, 329(4), 351(2) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం..శాఖ ప్రతిష్టపై ప్రభావం,సామాన్య ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీస్ శాఖలోనే మహిళా సిబ్బంది వేధింపులకు గురయ్యారనే ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చే పోలీస్ వ్యవస్థలో ఇలాంటి ఆరోపణలు రావడం శాఖ ప్రతిష్టను దెబ్బతీసే అంశంగా మారింది.ఫిర్యాదు వెలుగులోకి వచ్చిన వెంటనే జిల్లా ఎస్పీ స్పందించి వీఆర్‌కు బదిలీ చేయడం, విచారణ ప్రారంభించడం పరిపాలనా పరంగా కీలక చర్యగా భావిస్తున్నారు.గతంలోనూ వివాదాల్లో పేరుఎస్సై విజయ్‌కుమార్‌పై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అప్పిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ భర్త శ్రీనివాస్ ఒక కేసు విషయమై పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో అకారణంగా బెదిరింపులకు పాల్పడి, అక్రమ కేసులు నమోదు చేశారనే ఆరోపణలు అప్పట్లో వెలువడ్డాయి.ఈ వ్యవహారంపై సర్పంచ్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించగా, విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలతో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అనంతరం పాత కేసులను తిరిగి తెరపైకి తీసుకొచ్చి శ్రీనివాస్‌ను జైలుకు పంపించారనే ఆరోపణలు కూడా వినిపించాయి.సమగ్ర విచారణకు డిమాండ్ప్రస్తుత లైంగిక వేధింపుల కేసుతో పాటు గతంలో వచ్చిన ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ జరపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకం నిలబెట్టాలంటే పారదర్శక దర్యాప్తు చేసి, నిజానిజాలు వెలికి తీయాలని అభిప్రాయాలు,వ్యక్తమవుతున్నాయి.