రిటైర్మెంట్ తీసుకున్న మూడు రోజులకే మాజీ డీఎస్పీ రసూల్ సాహెబ్ మృతి
జనం న్యూస్ జూన్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి దామలచెరువులో విషాదం.. పోలీసు, రాజకీయ వర్గాల్లో దిగ్భ్రాంతిఅన్నమయ్య జిల్లా పాకాల మండలం దామలచెరువు సంధు వీధికి చెందిన మాజీ డీఎస్పీ రసూల్ సాహెబ్ ఆకస్మిక మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గత నెల మే నెలలో డీఎస్పీ హోదాలో పదవీ విరమణ పొందిన ఆయన, రిటైర్మెంట్ తీసుకున్న కేవలం మూడు రోజులకే గుండెపోటుతో బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు.సాధారణ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో సేవలను ప్రారంభించిన రసూల్ సాహెబ్, తన క్రమశిక్షణ, అంకితభావం, విధి నిర్వహణలో నిబద్ధతతో అంచెలంచెలుగా ఎదుగుతూ డీఎస్పీ స్థాయికి చేరుకున్నారు. సుదీర్ఘకాలం పోలీసు శాఖలో వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మంచి అధికారిగా గుర్తింపు పొందారు.పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడపాలని భావించిన తరుణంలోనే ఆయన ఆకస్మిక మరణం చెందడం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను, సహచర పోలీసు అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రిటైర్మెంట్ ఆనందం ముగియకముందే ఈ విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలచివేసింది. రసూల్ సాహెబ్ మరణవార్త తెలిసిన వెంటనే పలువురు పోలీసు ఉన్నతాధి కారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పోలీసు శాఖకు ఆయన చేసిన సేవలను కొనియాడారు.గ్రామ ప్రజలు మాట్లాడుతూ, రసూల్ సాహెబ్ నిరాడంబర వ్యక్తిత్వం కలిగిన అధికారి అని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి పట్ల దామలచెరువు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.