అంతర్రాష్ట్ర కరుడుగట్టిన దొంగ వికాస్ సింగ్ ను అరెస్ట్ చేసిన వికారాబాద్ జిల్లా పోలీస్.
జనం న్యూస్ 05 జూన్ వికారాబాద్ జిల్లా :-వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికంఠ నగర్ కాలనీలో గత నెల (01.05.2026న) రాత్రి సమయం లో ఒకరి ఇంట్లోకి చొరబడి ఒకటిన్నర తులాల బంగారు ఆభరణాలు, రూ. 2,10,000 నగదును అపహరించిన చోరీ కేసును పోలీసులు అత్యంత సమర్థవంతంగా ఛేదించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకున్న వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య గారి ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ల నేతృత్వంలోని ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారం, మరియు నేరస్థుల కదలికలను సిసి కెమెరాల ఆదారాలను విశ్లేషిస్తూ లోతైన దర్యాప్తు చేపట్టిన పోలీసులు, చివరకు నేర స్థలంలో సేకరించిన సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా ఈ చోరీకి పాల్పడిన ప్రధాన నిందితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వికాస్ సింగ్ అలియాస్ తేజా సింగ్ గా గుర్తించారు.సినిమా స్టైల్లో దొంగతనాలు – దొంగసొమ్ముతో సేవా కార్యక్రమాలు – విలాసవంతమైన జీవితం:ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని పోచమ్మ బస్తీ,గాందీనగర్ మరియు సూరారం(సాయిబాబా నగర్) పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న వికాస్ సింగ్, పైకి కూలీ పనులు చేస్తున్నట్లు నటిస్తూ రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. గతంలో ఇతను దొంగతనం చేసిన ఏరియాలు అయిన నర్సాపూర్, మేడ్చల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని నేరాల్లో ఇతనే దొంగతనం పాల్పడినట్లు సాంకేతిక ఆదారాలు లభించాయి. దీనితో నిందితుడిపై గట్టి నిఘా పెట్టిన జిల్లా పోలీస్ అధికారులు, అర్థరాత్రి సమయంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు నమ్మలేని నిజాలు వెల్లడించాడు. 16 ఏళ్ల మైనర్ వయసులోనే నేర జీవితాన్ని ప్రారంభించిన ఇతనిపై గతంలో సంగారెడ్డి, బొల్లారం పరిసర ప్రాంతాలలో సుమారు 34 రాత్రి వేళల దొంగతనం కేసులు ఉన్నాయి. 2018లో నాలుగు, 2021లో తొమ్మిది, 2022లో 21 కేసుల్లో సంగారెడ్డి పోలీసులు ఇతడిని అరెస్ట్ చేయగా, జైలు శిక్ష అనుభవించి 2024 జూన్ 26 నాడు జైలు నుండి విడుదలయ్యాడు. అయినప్పటికీ ఇతని ప్రవర్తనలో మార్పు రాకపోగా, తిరిగి వికారాబాద్ జిల్లా, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పరిధుల్లో మొత్తం 27 రాత్రి పూట దొంగతనాలకు పాల్పడి 157 తులాల బంగారం, 256 తులాల వెండి, రూ. 8,22,500 నగదును దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. దొంగతనం ద్వారా వచ్చిన డబ్బుతో నిందితుడు జల్సాలు చేయడమే కాకుండా, తన స్వగ్రామంలో ప్రజలకు ‘హెల్పింగ్ హ్యాండ్’అనే ఎన్‌జిఓ పేరుతో డబ్బులు స్కూల్స్ లో బ్యాగులు,నోట్ బుక్ లు పంచుతూ, స్నేహితులను విహారయాత్రలకు చెన్నై, గోవా, విజయవాడ, విశాకపట్నం, బెంగళూర్, రాజస్తాన్ మరియు డెహ్రాడూన్ లకు తీసుకెళ్తూ స్థానికంగా తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఒక రకమైన సామాజిక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దొంగను ప్రోత్సహించిన బంగారం వ్యాపారుల ముఠా:దొంగిలించిన ఆభరణాలను తన స్వగ్రామ పరిసర ప్రాంతాలు అయిన కుర్వర్ మరియు గంజేరి క్రింద ఉన్న బంగారం షాప్ యజమానులకు అమ్మ ద్వారా అమ్మేవాడని విచారణలో తేలింది:1) శ్యామ్ మోహన్ (బాబా శాలిక్ రామ్, బంగారం షాప్ యజమాని) – నివాసం: కుర్వర్, సుల్తాన్‌పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ (UP). 2) సూరజ్ మోహన్ (బాబా శాలిక్ రామ్,బంగారం షాప్ యజమాని) – నివాసం: కుర్వర్, సుల్తాన్‌పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ (UP). 3) అశోక్ సోని (అశోక్ సోని జెవెలర్స్ యజమాని) – నివాసం: కుర్వర్, సుల్తాన్‌పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ (UP). 4) వికాస్ అగ్రహారి (వికాస్ జెవెలర్స్ స్టోర్–గంజేరి)– నివాసం: భగ్వాన్ పూర్, సుల్తాన్‌పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ (UP).మైనర్‌గా ఉన్నప్పుడు దొంగతనాలు చేసిన మాట వాస్తవమేనని, అయితే తర్వాత ఈ బంగారం షాప్ యజమానులు దొంగసొమ్ము ద్వారా ఎక్కువ లాభాలు గడించడం అలవాటు పడి, ఇతర రాష్ట్రాలలో దొంగతనాలు చేసి తమకు బంగారం అమ్మితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, తనను ప్రోత్సహించారని నిందితుడు ఒప్పుకున్నాడు. తన దగ్గర డబ్బులు లేకపోయినా ముందే డబ్బులు ఇచ్చి మరి నేరాలకు పురికొల్పేవారని, ఒకానొక దశలో తను దొంగతనాలు చేయడానికి భయపడితే, పైన పేర్కొన్న యజమానులందరూ తలా రూ. 10,000 చొప్పున మొత్తం 40,000 రూపాయాలు ఇచ్చి అక్రమంగా తుపాకి కొనడానికి కూడా ప్రోత్సహించారని, వారి ప్రోత్సాహం తోనే ఒక తుపాకి కొనడం జరిగింది అని నిందితుడు సంచలన నిజాలు వెల్లడించాడు. నిందితునిపై పాత 34 కేసులు, ఇప్పటి 27 కేసులు కలిపి మొత్తం 61 కేసులు నమోదయ్యాయని ఎస్‌పి తెలిపారు. తేదీ 26.06.2024 నుండి ఇప్పటి వరకు చేసిన నేరాలు ఒప్పుకున్న 27 కేసులలో నేరస్థున్ని అరెస్టు చేయడం జరుగుతుంది. మరియు ప్రస్తుతం నిందితుని నుండి తులంన్నర బంగారం ఆభరణాలు, మరియు ఒక తుపాకీ (5ఎంఎం పిస్తోల్) ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రిసీవర్లపై కఠిన చర్యలు – ఎస్‌పి గారి హెచ్చరిక:- పైన పేర్కొన్న బంగారం దుకాణాల యజమానులందరూ ఒక సిండికేట్ (ఆర్గనైజర్లు) గా ఏర్పడి, నిందితుడితో చేయికలిపి దొంగతనాలు చేయిస్తున్నట్లు మరియు అక్రమంగా అయూదాలు కొనడానికి ప్రోత్సహించడం జరుగుతుంది అని దర్యాప్తులో తేలడంతో, సదరు యజమానులపై కూడా ఆర్గనైజేడ్ క్రైమ్ , ఆర్మ్స్ యాక్ట్ ,అలవాటు పడ్డ నేరస్తులు, సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అవసరమైతే వీరిపై పీడీ యాక్ట్ (PD Act) కూడా నమోదు చేస్తామని వికారాబాద్ ఎస్‌పి హెచ్చరించారు. ఈ దొంగసొమ్ము రిసీవర్లను ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి ఒక సీనియర్ పోలీస్ అధికారితో ప్రత్యేక దర్యాప్తు టీమ్‌ను ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది,దొంగ సొత్తు స్వాదీనం చేసుకొని వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము.జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, కాలనీలు, గ్రామాల్లో ఎవరైనా గుర్తుతెలియని లేదా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వికారాబాద్ ఎస్‌పి కోరారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని సూచించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని భరోసా ఇస్తూ, ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీస్ అధికారులను సంప్రదించాలని వికారాబాద్ ఎస్‌పి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.”అత్యంత ప్రతిభావంతంగా, చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్న, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ మరియు వారి సిబ్బందిని వికారాబాదు ఎస్‌పి శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి, రివార్డులను ప్రకటించారు.