రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే.అమలు చేయాలి

June 24, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 24 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : టీఆర్పీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు మొరుగు వీరేష్ డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతాంగానికి ఎకరాకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున రైతు భరోసా అందిస్తామని ఘనంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని టీఆర్పీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు మొరుగు వీరేష్ విమర్శించారు.గతంలో ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సహాయం అందిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వం, అనంతరం రూ.12 వేలకే పరిమితం చేసినా ఆ మొత్తాన్ని కూడా రైతులందరికీ సకాలంలో అందించలేకపోయిందన్నారు. యాసంగి సీజన్‌లో కేవలం రెండు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా చెల్లించి మిగతా రైతాంగాన్ని నిరాశపరిచిందని ఆరోపించారు. ప్రస్తుతం మరోసారి రైతు భరోసా చెల్లింపులపై ప్రకటనలు చేస్తున్నప్పటికీ రైతుల్లో ప్రభుత్వంపై విశ్వాసం తగ్గిపోయిందన్నారు.రైతు భరోసా పథకం అమలులో జాప్యాలు, భూ రికార్డుల సమస్యలు, అర్హుల గుర్తింపులో లోపాలు నిధుల విడుదలలో ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సాగు సీజన్ ప్రారంభంలో పెట్టుబడి అవసరమైన సమయంలో సహాయం అందకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు.
వ్యవసాయాన్ని పండుగలా మారుస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు కూడా సకాలంలో అందించలేకపోతోందన్నారు. ఫర్టిలైజర్ యాప్ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, అందుబాటులో ఎరువులు లేకపోయినా యాప్‌లో బుకింగ్ చేసుకోవాలని చెప్పడం రైతాంగంపై అదనపు భారం మోపినట్టేనన్నారు. రాష్ట్రంలోని అనేక మంది రైతులకు స్మార్ట్‌ఫోన్లు లేకపోవడం, డిజిటల్ అవగాహన తక్కువగా ఉండడం వల్ల ఈ విధానం రైతులను మరింత అయోమయంలోకి నెట్టిందన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఎరువుల ధరలను అదుపులో ఉంచడంలో విఫలమైందని, వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా కనీస మద్దతు ధరలు నిర్ణయించకుండా రైతాంగాన్ని నష్టపరుస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం బాధ్యతలు తప్పించుకునే ధోరణి అవలంబించడం వల్ల రైతాంగమే నష్టపోతోందన్నారు.రైతు బీమా పథకం అమలులోనూ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, అకాల మరణం చెందిన రైతు కుటుంబాలకు అందాల్సిన ఆర్థిక భద్రత సకాలంలో అందక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కొని రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అర్హులైన ప్రతి రైతుకు వివక్ష లేకుండా సకాలంలో నిధులు విడుదల చేయాలని, కౌలు రైతులను కూడా పథకాల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచి, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.రైతాంగ సంక్షేమం కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా కార్యరూపం దాల్చినప్పుడే రైతులకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని, వ్యవసాయ రంగం బలోపేతం అవుతుందని మొరుగు వీరేష్ పేర్కొన్నారు.మొరుగు వీరేష్ టీఆర్పీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు

🌐 Select Language:
📰 ePaper