రైతు బీమా కొనసాగింపుపై కలెక్టర్‌కు వినతి
రైతు రక్షణ సమితి అధ్యక్షులు హింగే భాస్కర్, వరికిల కిషన్‌రావు
జనం న్యూస్ ఆగష్టు 24 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న రైతు బీమా పథకాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించాలని కోరుతూ తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ రైతు కుటుంబంలో ప్రధాన ఆధారమైన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినప్పుడు రైతు బీమా పథకం ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తోందన్నారు.అయితే పథకం కొనసాగింపుపై రైతుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.రైతు బీమా పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకుండా కొనసాగించాలని, ప్రభుత్వం చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హులైన రైతులందరికీ నిరంతరాయంగా బీమా రక్షణ కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న బీమా క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించాలని కోరారు.బీమా సొమ్ము అందడంలో జాప్యం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు రైతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం అధికారికంగా స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు.రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు కష్టకాలంలో రక్షణ కవచంగా నిలుస్తోందని, ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి రైతులకు భరోసా కల్పించాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికిల కిషన్‌రావు, ఉపాధ్యక్షులు రామారావు, సుకినే సుధాకర్, సురావు బాబురావు, వాంకే రాజు, కోక్కు తిరుపతి, అంబిరి శీను, ఎర్రబెల్లి రవీందర్‌రావు, మాధవరావు, గుండ సత్యనారాయణ, నర్సింగారావు తదితరులు పాల్గొన్నారు.