వరదలపై హై అలర్ట్.. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం
జనం న్యూస్ జూలై 31 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించండిప్రాణ రక్షణే ప్రధానం… వరదల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలిడా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతున్న వరద పరిస్థితుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని పేర్కొంటూ, లోతట్టు ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో నిరంతరం చరవాణి ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసు, వైద్య, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్నారని చెప్పారు.లంక గ్రామాల్లో నివసిస్తున్న గర్భిణీ స్త్రీలను వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. గర్భిణీలకు అవసరమైన వైద్య సేవలు, మందులు, అత్యవసర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని లంక గ్రామాల పాఠశాలలకు జిల్లా యంత్రాంగం సెలవులు ప్రకటించిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వరద ప్రాంతాలకు, నది ఒడ్డులకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.వరదల కారణంగా నది పరివాహక ప్రాంతాల్లో పంట్లు (ఫెర్రీలు) రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ఫెర్రీ సేవలు పునరుద్ధరించే వరకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను మాత్రమే వినియోగించాలని సూచించారు.ఎవరూ వరద నీటిలోకి వెళ్లి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దని మంత్రి సుభాష్ హెచ్చరించారు. సెల్ఫీలు, వీడియోల కోసం వరద ప్రవాహాల వద్దకు వెళ్లడం, నీట మునిగిన రహదారులపై ప్రయాణించడం, కాలువలు, వాగులు దాటే ప్రయత్నాలు చేయడం ప్రమాదకరమని తెలిపారు. విద్యుత్ తీగలు, బలహీనమైన గట్లు, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని కోరారు. ప్రజల సహకారంతోనే వరదల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని పేర్కొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ తమ కుటుంబ సభ్యులు, పొరుగువారిని కూడా జాగ్రత్తగా ఉండేలా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.