సలబత్‌పూర్ ఎక్సైజ్ చెక్‌పోస్ట్ వద్ద అక్రమ వసూళ్ల ఆరోపణ….

July 31, 2026 | తెలంగాణ

రాజస్థాన్ లారీ డ్రైవర్ నుంచి రూ. 200 డిమాండ్ – వీడియో వైరల్ …


కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి సస్పెన్షన్‌కు నివేదిక – ఎక్సైజ్ ఎస్పీ ముకుంద రెడ్డి..

మద్నూర్ జూలై 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం సలబత్‌పూర్ ఎక్సైజ్ చెక్‌పోస్ట్ వద్ద బుధవారం సాయంత్రం రాజస్థాన్‌కు చెందిన రెండు భారీ ట్రక్కులను ఆపి ఒక్కొక్క లారీ నుంచి రూ. 200 చొప్పున వసూలు చేసేందుకు యత్నించిన ఘటన సంచలనం రేపింది.చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ తో పాటు మరొకరు లారీని ఆపి డబ్బులు డిమాండ్ చేయగా, లారీలో ప్రయాణిస్తున్న యూట్యూబర్ దీనిని ప్రశ్నించారు.ఘటన వివరాలుమాకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని యూట్యూబర్ అడగ్గా, “రాష్ట్రంలో ఎక్కడా చెక్‌పోస్టులు లేవు, మద్నూర్ దగ్గరే చెక్‌పోస్ట్ ఉంది, మేమే డబ్బులు తీసుకుంటున్నాము” అని కానిస్టేబుల్ సమాధానం ఇచ్చినట్లు వీడియోలో ఉంది.దీంతో లారీని ఆపిన యూట్యూబర్ “మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఎప్పుడు ఇలాగే అడుగుతున్నారు? ఇది మంచిది కాదు” అంటూ మొత్తం సంఘటనను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. విచారణ, శాఖాపరమైన చర్యలు సలబత్‌పూర్ వద్ద చోటుచేసుకున్న ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు.వీడియో వైరల్ కావడంతో వెంటనే విచారణ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి పాత్రను గుర్తించినట్లు చెప్పారు.ఈ అంశంపై శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. విచారణ నివేదికను కరీంనగర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, నోడల్ అధికారికి సమర్పించనున్నారు.క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సదరు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ముకుంద రెడ్డి వెల్లడించారు .ఎక్సైజ్ శాఖ స్పందనఅంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సలబత్‌పూర్ చెక్‌పోస్ట్‌ను గత రెండు దశాబ్దాలుగా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన చెప్పారు.చెక్‌పోస్ట్‌లో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేపడుతున్నారని తెలిపారు.ఈ ఘటనపై శాఖ ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించదని, విధి నిర్వహణలో నిబంధనలు, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బాధ్యులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి స్పష్టం చేశారు.

🌐 Select Language:
📰 ePaper