వరి మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు
జనం న్యూస్ 22 మే వికారాబాద్ జిల్లా :- వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు పరిగి డిఎస్పి, కోడంగల్ సిఐ మరియు ఇతర పోలీస్ అధికారులు, సంబంధిత శాఖ అధికారులతో పాటు అదనపు కలెక్టర్ గారితో కలిసి కోడంగల్ సర్కిల్ పరిధిలోని దుద్యాల మండలంలోని గౌరారం వరి మిల్లు మరియు బొంరాస్పేట్ మండలంలోని బురన్పూర్ దుర్గా భవానీ వరి మిల్లును ఆకస్మికంగా సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మిల్లుల యజమానులు, సిబ్బంది మరియు రైతులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియ, తూకాల నిర్వహణ, రైతులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందుతున్నదా, తూకాల్లో అవకతవకలు ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు. ప్రస్తుతం కొనుగోళ్లు పారదర్శకంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మిల్లుల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు, రైతులను మోసం చేసే దళారులు, అక్రమ కొనుగోళ్లు లేదా తూకాల్లో మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు.