రైతులకు 40–50 శాతం వరకు రాయితీ. జనం న్యూస్ అక్టోబర్ 02 కోటబొమ్మాళి మండలం ; పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతులకు రాయితీపై గడ్డి కత్తిరింపు యంత్రాలు (చాఫ్ కట్టర్లు) అందజేయనున్నట్లు నిమ్మాడ పశువైద్యాధికారి డా. లఖినేని కిరణ్కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు తమ సమీప పశువైద్యశాలలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం కింద రెండు రకాల చాఫ్ కట్టర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 3 హెచ్పీ, 3 బ్లేడ్ చాఫ్ కట్టర్ యూనిట్ ధర రూ. 40,500 కాగా, 50 శాతం రాయితీ రూ. 20,250, లబ్ధిదారుడి వాటా రూ. 20,250గా ఉంది. అలాగే 2 హెచ్పీ, 3 బ్లేడ్ చాఫ్ కట్టర్ యూనిట్ ధర రూ.33,970 కాగా, 40 శాతం రాయితీ రూ.13,588, లబ్ధిదారుడి వాటా రూ.20,382గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.చాఫ్ కట్టర్లతో ప్రయోజనాలు,పచ్చిమేత, ఎండు గడ్డిని చిన్న ముక్కలుగా కత్తిరించడం ద్వారా మేత వృథాను తగ్గించవచ్చని తెలిపారు. మేత వినియోగం పెరగడంతో పశువుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పాల దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. కూలీల ఖర్చు, సమయం కూడా ఆదా అవుతాయని చెప్పారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలకు మేత సిద్ధం చేసేందుకు ఈ యంత్రాలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు వెంటనే సమీప పశువైద్యశాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని డా. లఖినేని కిరణ్కుమార్ కోరారు.