జనం న్యూస్ నవంబర్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లిలోని ట్రక్ పార్క్ భూములు, హౌసింగ్ బోర్డు భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ ప్రజా అవసరాల కోసం ఆ భూములను కాపాడాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) తదితర పార్టీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న శాంతియుత నిరాహార దీక్షకు శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నేత అశ్వంత్ కుమార్ సంఘీభావం తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అశ్వంత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లిలోని ప్రభుత్వ భూములను కాపాడుకుంటూ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా దృష్ట్యా భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన పార్కులు, ఆటస్థలాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఈ భూములు ఎంతో అవసరమని తెలిపారు. ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సిన భూములను అమ్ముకుంటే రాబోయే తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజల భవిష్యత్తు కోసం కాపాడుకుంటూ వచ్చిన భూములను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయాలని చూడటం సరికాదని, ఈ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అశ్వంత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేపట్టిన శాంతియుత నిరాహార దీక్షకు తమ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నామని, ట్రక్ పార్క్, హౌసింగ్ బోర్డు భూములను కాపాడుకునే పోరాటంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి ఉంటారని అశ్వంత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య నాయకులు అక్షయ పటేల్ గిరీష్ దుర్గ సిద్ధార్థ అఖిల్ లక్ష్మీ ప్రసాద్ సందీప్ మరియు విద్యార్థి నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.