తీవ్ర సమస్యగా సైనస్ పరిణమించింది: పవన్ కల్యాణ్
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఆరోగ్య సమస్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సైనస్ తీవ్ర సమస్యగా పరిణమించిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… పవన్ కల్యాణ్ కొద్ది రోజుల కిందట అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేయించుకన్నారు. అనంతరం కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం రోజున పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబుకు పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల దంపతులు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన చంద్రబాబు… ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తన శస్త్ర చికిత్స వివరాలు తెలిపారు. సైనస్ సంబంధిత ఇబ్బందిగా భావించినప్పటికీ అది తీవ్ర సమస్యగా పరిణమించిందని, ఇన్ఫెక్షన్ గా మారి కంటిపై ప్రభావం చూపడంతో శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (ఫెస్) చేసినట్లు చెప్పారు. శస్త్ర చికిత్స అనంతరం ఇప్పటికీ కొంత మేరకు నాసల్ బ్లీడింగ్ ఉన్నదని, మరో వారం రోజులలో సర్దుకుంటుందని డాక్టర్లు తెలిపారని అన్నారు. అదే విధంగా సినిమాలకి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలలో తగిలిన గాయాలను అప్పట్లో పట్టించుకోలేదని అవి కూడా ఇప్పుడు బాధిస్తున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. భుజం దగ్గరి మజిల్ కి గాయాలు గత అయిదేళ్ల నుంచి ఉన్నాయని… రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ ఉందని వైద్యులు తెలిపారని పవన్ కల్యాణ చెప్పారు. ఆ సమయం నుంచి వైద్యంపై పూర్తి శ్రద్ధ చూపకపోవడంతో ఇప్పుడు అవి తిరగబెడుతున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని, శస్త్ర చికిత్స అవసరం ఉందని చెప్పారు.