పాంచజన్యం అమలు చేయకపోతే, విద్య,వైద్యం ఫ్రీగా ఇవ్వకపోతే కట్టేసి కొట్టండి: టీఆర్ఎస్ చీఫ్ కవిత
జనం న్యూస్: విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన పాంచజన్యంలో పేర్కొన్న ఐదు అంశాలను అమలు చేయకుంటే గన్ పార్క్ లోని అమరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టాలని సూచించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. తన తండ్రి కేసీఆర్ తో తనకు పంచాయితీ లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడిగానే ఆయననను విమర్శించానని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన సరే తెలంగాణ ప్రజల కోసం తాను ముందుకే వెళ్తానన్నారు. తన టార్గెట్ సర్వోదయ తెలంగాణ సాధించటమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఎవరైతే విలనో…తనకు కూడా వాళ్లే విలన్ అని చెప్పారు. కేసీఆర్ ను రాజకీయ నేతగానే విమర్శించానని తండ్రిగా ఆయనతో ఎలాంటి సమస్య లేదని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత చెప్పారు.
రాళ్లతో కొట్టండి: తెలంగాణ రక్షణ సేన ప్రకటించిన పాంచజన్యం లోని ఐదు అంశాలు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల విషయంలో తాను ఇచ్చిన మాట తప్పితే అమరవీరుల స్తూపం వద్ద స్తంభానికి కట్టేసి కొట్టాలని కల్వకుంట్ల కవిత తెలిపారు. అన్ని విషయాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే హామీలు ఇచ్చానని చెప్పారు. గత 20 ఏళ్లుగా తనను చూస్తున్నారని ఇచ్చిన మాట, పట్టిన తోవను విడవకుండా ఉన్నానని అన్నారు. తెలంగాణలో విద్య, వైద్యం కోసమే ప్రజలు 60 శాతం డబ్బు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కచ్చితంగా సంకల్పం తీసుకుంటే ఇది సాధ్యమేనని చెప్పారు. ఆరోగ్య శ్రీ ప్రారంభినప్పుడు, విద్యార్థులకు ఫ్రీ మీల్స్ పెట్టినప్పుడు కూడా ఇది సాధ్యమా అంటూ చాలా ప్రశ్నలు వచ్చాయన్నారు. కానీ ఇప్పుడు వాటిని అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పాంచజన్యంలోని ఐదు అంశాలను అమలు చేయటంపై ఆర్థిక నిపుణులతో చర్చలు జరిపానని కవిత చెప్పారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో లక్ష కోట్ల రూపాయలను తమ ప్రాధాన్యత అంశాలకు ఖర్చు చేయవచ్చన్నారు. ఆ విధంగా చూస్తే చేయాలన్న సంకల్పం ఉంటే చాలు ఇదంతా సాధ్యమేనని స్పష్టం చేశారు. తల్లిలా తాను పరిణితి చెందుతానంటే చాలా మంది విమర్శలు చేశారని కవిత గుర్తు చేశారు. కానీ తల్లి మాదిరి లాలన లేని కారణంగానే ఇవ్వాళ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక తల్లి మాదిరిగా ఆలోచిస్తే మాత్రమే ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం వస్తుందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి అది చేతకావటం లేదన్నారు. వెయ్యి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక తల్లి మాదిరి పాలన చేస్తామని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు.