గద్వాల మున్సిపాలిటీలో టెండర్ దరఖాస్తుదారులకు ఇబ్బందులు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్.
జనం న్యూస్ 16 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల మున్సిపాలిటీ కార్యాలయంలో వెజ్ నాన్-వెజ్ మార్కెట్ దుకాణాల ఓపెన్ వేలం దరఖాస్తుల స్వీకరణకు ఈరోజు చివరి తేదీ కావడంతో టెండర్ దారులు పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే దరఖాస్తు ఫారాలు ఎక్కడ లభిస్తాయనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో వారు అయోమయానికి గురయ్యారు.మున్సిపాలిటీ కార్యాలయంలో టెండర్ దరఖాస్తుల కోసం ప్రత్యేక కౌంటర్ లేకపోవడంతో దరఖాస్తుదారులు ఒక విభాగం నుంచి మరో విభాగానికి తిరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేలంలో పాల్గొనడానికి వచ్చిన పలువురు టెండర్ దారులు అవసరమైన సమాచారం కోసం అధికారులను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.ఈ విషయమై విలేకరి మున్సిపల్ రెవెన్యూ అధికారి రాజేష్‌ను సంప్రదించగా టెండర్ దరఖాస్తుదారులు నేరుగా రెవెన్యూ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు తీసుకుని టెండర్లో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. అయితే దరఖాస్తుల పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్ లేదా సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
టెండర్ ప్రక్రియలో పారదర్శకతతో పాటు ప్రజలకు సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందని పలువురు కౌన్సిలర్లు అభిప్రాయపడుతున్నారు. టెండర్ దారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మున్సిపల్ రెవెన్యూ అధికారిని కౌన్సిలర్లు కూడా ప్రశ్నించినట్లు సమాచారం.టెండర్ దరఖాస్తుల స్వీకరణ చివరి రోజునే ఇటువంటి పరిస్థితులు తలెత్తడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టెండర్ దారులు వెంటనే ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తుల పంపిణీ మరియు స్వీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని కోరుతున్నారు.ఈ అంశంపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పందించి భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, టెండర్ దారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి టెండర్ అప్లికేషన్ ఫారాలు అందించే ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.