మున్నూరు కాపు కుల పరిరక్షణకు రాష్ట్రవ్యాప్త ఉద్యమం ప్రారంభం
మున్నూరు కాపు కుల హక్కులు మున్నూరు కాపులకే
జనం న్యూస్ జూన్ 15 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కుల అస్తిత్వం, హక్కులు, భవిష్యత్తు కోసం ఐక్యంగా ముందుకు రావాలి డా. కొండా దేవయ్య పటేల్,మున్నూరు కాపు సమాజం తన చారిత్రక అస్తిత్వం, సామాజిక హక్కులు, రిజర్వేషన్ ప్రయోజనాలు మరియు భావితరాల భవిష్యత్తు పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా సంఘటిత ఉద్యమానికి సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డా. కొండా దేవయ్య పటేల్ పిలుపునిచ్చారు.హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కీలక సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపు సమాజాన్ని చైతన్యపరిచే కార్యాచరణపై విస్తృత చర్చ జరిగింది. సమాజానికి సంబంధించిన తాజా పరిణామాలు, కుల పరిరక్షణ, సంఘ బలోపేతం, యువత పాత్ర, రాజకీయ మరియు సామాజిక ప్రాతినిధ్యం వంటి అంశాలపై నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, మున్నూరు కాపు కుల ప్రత్యేకత, చరిత్ర, గుర్తింపు మరియు రాజ్యాంగబద్ధ హక్కులకు భంగం కలిగించే ఎలాంటి ప్రయత్నాలనైనా సమాజం అప్రమత్తంగా గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర కులాలను మున్నూరు కాపు కులంలో విలీనం చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు మరియు సంక్షేమ పథకాల అమలుపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.మున్నూరు కాపు కుల హక్కులు మున్నూరు కాపులకే అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే ఒకే కులం – ఒకే లక్ష్యం – ఒకే ఐక్యత అనే భావనతో సమాజం అంతా ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు.సంఘాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో కన్వీనర్లు, కో-కన్వీనర్ల నియామకం, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు, పట్టణాలు, డివిజన్లు, వార్డుల స్థాయిలో కమిటీల ఏర్పాటు చేపట్టాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.అలాగే రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతి మున్నూరు కాపు కుటుంబాన్ని సంఘంతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. పూర్తి స్థాయి డేటాబేస్ సిద్ధమైన అనంతరం ప్రత్యేక ఎన్నికల కమిటీ ద్వారా రాష్ట్ర, జిల్లా కమిటీల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని తీర్మానించారు.మున్నూరు కాపు సమాజ రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం యువత, మహిళలు, మేధావులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అందరూ ఒకే వేదికపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని నాయకులు పేర్కొన్నారు. కుల పరిరక్షణ, హక్కుల సాధన, భావితరాల భవిష్యత్తు నిర్మాణం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు ప్రకటించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లిపల్లి వెంకటేశ్వర్లు (జేవీఆర్) పటేల్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్.వి. మహేందర్ కుమార్ పటేల్, కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.