తులసీవనం వద్ద ట్రాఫిక్ పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అసోసియేషన్ సభ్యుల చొరవ – శిరీష సత్తూర్
జనం న్యూస్ జూన్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : ఆల్విన్ కాలనీలోని తులసీవనం గేటెడ్ కమ్యూనిటీ ఎదురుగా పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో స్కూల్ బస్సుల రాకపోకల కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా తులసీవనం అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నివాసితులకు, స్థానిక ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు స్వయంగా పర్యవేక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమెన్స్ వెల్ఫేర్ సెక్రటరీ శిరీష సత్తూర్ మాట్లాడుతూ, విద్యార్థుల భద్రతతో పాటు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలల ప్రారంభంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.తులసీవనం అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, విజిలెన్స్ సెక్రటరీ సాయికుమార్, సభ్యులు చందన్, శ్రీనివాస్ తదితరుల సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేందుకు నలుగురు సెక్యూరిటీ గార్డులను ప్రత్యేకంగా నియమించి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకున్నారు.అసోసియేషన్ సభ్యులు స్వయంగా ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షిస్తూ స్కూల్ బస్సులు, ఇతర వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రయాణించేలా కృషి చేశారు. స్థానిక ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తులసీవనం అసోసియేషన్ చేపట్టిన ఈ చర్యలను నివాసితులు అభినందించారు.