కూకట్పల్లి రాజకీయ, సినీ రంగాలకు తీరని లోటు సీనియర్ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు హఠాన్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి
జనం న్యూస్ జూన్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ సీనియర్ నాయకుడు, ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ స్ఫూర్తి ప్రతీక గొట్టిముక్కల పద్మారావు హఠాన్మరణం స్థానిక రాజకీయ, సామాజిక, సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి కూకట్పల్లి ప్రాంతానికి తీరని లోటుగా పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అభివర్ణిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైన రోజుల నుంచే ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ, ఉద్యమానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా పద్మారావు ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పోషించిన పాత్రను ఉద్యమ సహచరులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
ప్రజా సేవనే ధ్యేయంగా భావించిన ఆయన, కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలతో నిరంతరం మమేకమై అనేక మంది పేదలు, కార్యకర్తలకు అండగా నిలిచారు. అవసరమైన సమయంలో సహాయం అందిస్తూ ప్రజాబంధువుగా పేరు సంపాదించుకున్నారు. అలాగే సినీ నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన పద్మారావు, పలువురు కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు కల్పించి పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేశారు. సినీ రంగంలోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించింది.
సౌమ్య స్వభావం, నిగర్వి వ్యక్తిత్వంతో అందరి మన్ననలు పొందిన గొట్టిముక్కల పద్మారావు ఇక లేరనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందని పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మరియు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సేవలు అందించిన గొట్టిముక్కల పద్మారావు మరణం కూకట్పల్లి ప్రాంతానికే కాకుండా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని విశ్వసించిన ప్రతి ఒక్కరికీ తీరని లోటని వారు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని పలువురు సంతాపం తెలియజేశారు.