ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
జనం న్యూస్, ఆగష్టు 04, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.కేజీబీవీ పాఠశాలలో తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు, పరిశుభ్రతను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకుని, పోషకాహారంతో కూడిన పరిశుభ్రమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల విధుల నిర్వహణ, బోధన తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువులు, భవిష్యత్ లక్ష్యాలు, పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.