నిందితులను కఠినంగా శిక్షించాలి
సీతానగరం, జనం న్యూస్:* సీతానగరం మండలం రఘుదేవపురంలో దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేయడం శోచనీయ మని రాజానగరం నియోజకవర్గ భాజపా మాజీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని వెదుళ్లపల్లి స్వగృహం వద్ద బుధవారం ఆయన మాట్లాడుతూ అశేష భక్తులతో నిత్య పూజ అందుకుంటున్న కనకమహాలక్ష్మి, ఆంజనేయ స్వామి విగ్రహాలను కక్షపూరిత మైన ఉద్దేశంతో రాళ్లతో కొట్టి విగ్రహాల తలలు వేరు చేయడం దారుణమన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ ఆధ్యాత్మిక దేవాలయాలపై దాడులు ఎక్కువగా జరిగేవి అన్నారు. ఆ సమయంలో భాజపా తరపున ఎన్నో పోరాటాలు హిందూ దేవాలయాలు కాపాడేందుకు ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాలు చేసేవారమని నీరుకొండ వీరన్న చౌదరి స్పష్టం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే సీతానగరం పోలీసులు విచారణ చేపట్టారని పట్టుబడిన నిందితులను కఠినంగా శిక్షించాలని నీరుకొండ కోరారు. హిందూ సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయని, భక్తులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి ఉదాహరణగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్మ పరిరక్షణ కోసం భాజపా ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. నీరుకొండతో పాటు భాజపా నాయకులు మడి చల్ల మూర్తి, రాపాక వెంకటలక్ష్మి, బాలయోగి తదితరులు పాల్గొన్నారు.