ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతాం : ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు
జనం న్యూస్: ఆగస్టు 7 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాన్సెప్ట్ జిల్లామురమళ్ళలోని ముమ్మిడివరం శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక మరియు మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలపై వినతిపత్రాలను ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకు అందజేశారు. అర్జీదారుల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు వెంటనే పరిష్కరించగల అంశాలపై సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిగిలిన సమస్యలను సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా మరికొన్ని సమస్యలను ప్రజా సమస్యల పరిష్కార వేదిక వెబ్ వేదికలో నమోదు చేసి నిరంతరం పర్యవేక్షించాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు.