హోదాను చూసి మిడిసి పడకూడదు : నీరుకొండ వీరన్న చౌదరి
జనం న్యూస్ సెప్టెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీరుకొండ వీరన్న చౌదరి ఒక ఇంటర్వ్యూలో సందేశం ఇస్తూ “సమాజంలో మనకున్న పదవి, డబ్బు, హోదా కంటే మనం సంపాదించిన జ్ఞానం, సంస్కారం గొప్పవి. అధికారం, పదవులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. మనం నేర్చుకున్న సంస్కారం, విజ్ఞానం చనిపోయే వరకూ మనతోనే ఉంటాయి” అన్నారు.”నువ్వు హోదాలో ఉన్నప్పుడు మాత్రమే జనం నీకు నీరాజనం పడతారు. విజ్ఞానం ఉన్న వారిని ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా గౌరవిస్తారు. జ్ఞానం లేని హోదా మరియు అధికారం సమాజానికి హానికరం. అందుకే వేమన గారు ‘అల్పబుద్ధి వాని కధికార మిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు’ అని చెప్పారు. అధికారంలో వ్యక్తికి సంస్కారం తోడైనప్పుడే నిజమైన నాయకుడిగా రాణిస్తాడు” అని అన్నారు.”అధికారం, హోదా ఎండలో వచ్చే నీడ లాంటివి. హోదాను చూసి ఇచ్చే గౌరవం మనిషికి కాదు, ఆ కుర్చీకి మాత్రమే. పదవిని చూసి అహంకారం చూపిస్తే, పదవి పోయాక పలకరించే నాథుడే ఉండడు. హోదా ఉంటే సరిపోదు, మనుషులను గౌరవించే మనసుండాలి. ఎదిగే కొద్దీ ఒదగడం నేర్చుకో. కాలం చక్రం తిరిగిన నాడు, నీ వినయమే నిన్ను కాపాడుతుంది” అని సూచించారు.”జీవితంలో హోదా అనేది ఒక బాధ్యత మాత్రమే. ఇతరులను తక్కువ చేయడానికి ఉపయోగించే ఆయుధం కాదు. కొంతమంది ఉన్నత పదవి రాగానే పాత మిత్రులను మర్చిపోతారు. అలా కాకుండా మనం కూడా క్రింది స్థాయి నుంచి వచ్చిన వాళ్లమే అని గుర్తుంచుకుని అందరికీ గౌరవం ఇచ్చినప్పుడే మన ఎదుగుదల ఆదర్శంగా ఉంటుంది. వినయం ఉన్నప్పుడే ఆ హోదాకు హుందాతనం, గౌరవం లభిస్తాయి” అని నీరుకొండ వీరన్న చౌదరి పేర్కొన్నారు.