ప్యాలారం–గోపనపల్లి ప్రధాన రహదారిపై వర్షపు నీరు.. ఆనకట్ట నిర్మాణం పూర్తి చేయాలి
వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ డిమాండ్
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్ 01. 09. 2026 జహీరాబాద్ నియోజకవర్గం, జరాసంగం మండలం: ప్యాలారం గ్రామం నుంచి గోపనపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై వర్షపు నీరు భారీగా చేరడంతో వాగు దాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ అన్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి రహదారిపై నీరు ప్రవహించడం వల్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని, రైతులు, విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు, అత్యవసర సేవలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్యాలారం–గోపనపల్లి ప్రధాన రహదారిపై వాగు వద్ద శాశ్వత పరిష్కారం కోసం ఆనకట్ట నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య పునరావృతం అవుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వర్షపు నీటిని నియంత్రించేలా ఆనకట్ట నిర్మాణాన్ని చేపట్టి, రహదారి భద్రతను కూడా మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు.వచ్చే బడ్జెట్లో ఆనకట్ట నిర్మాణానికి అవసరమైన నిధులు ప్రత్యేకంగా కేటాయించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చిట్టెంపల్లి బాలరాజ్ డిమాండ్ చేశారు. ప్రజలు, రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.