జనం న్యూస్ 17 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. రైస్ మిల్లుల్లో నిల్వలపై తనిఖీలు: కలెక్టర్ జోగుళాంబ ప్రతినిధి,గద్వాల: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలుపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.అక్టోబర్ 1 నుంచే అన్ని కొనుగోలు కేంద్రాలు పూర్తి సౌకర్యాలతో పనిచేసేలా గన్ని బ్యాగులు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, తేమ నిర్ధారణ యంత్రాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. రైతుల నుంచి హమాలీ, గన్ని బ్యాగుల పేరుతో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు, తేమ శాతం, చెల్లింపుల వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని ఆదేశించారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని సమీపంలోని ఎంపిక చేసిన రైస్ మిల్లులకు త్వరగా తరలించాలని, ఓపీఎంఎస్‌లో వివరాలను రోజువారీగా నమోదు చేయాలని తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా రాకుండా నిఘా పెంచాలని సూచించారు. రైస్ మిల్లుల్లో గతంలో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వలపై తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి వివరాలను డీజీఎస్‌సీ/పీవీ యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం, తప్పుడు నివేదికలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి స్మార్ట్ రేషన్ కార్డులు అందేలా పంపిణీని వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, పౌరసరఫరాల, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎల్‌డీఎం, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.