సున్నం చెరువు పార్కు వద్ద అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన జనం న్యూస్ నవంబర్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వతనగర్ ప్రజలకు డ్రైనేజీ సమస్య నుంచి ఉపశమనం కల్పించే దిశగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక చర్య చేపట్టారు. సున్నం చెరువు పార్కు వద్ద రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన డ్రైనేజీ పైప్లైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గత పదేళ్ల కేసీఆర్ పాలనలో కూకట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, పలు సమస్యలకు పరిష్కారం చూపామని పేర్కొన్నారు. అయితే గతంలో శంకుస్థాపనలు చేసి ప్రారంభించిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నత్తనడకన సాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సైతం ప్రభుత్వం సరైన స్థాయిలో నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ గౌసుద్దీన్, డివిజన్ అధ్యక్షులు లింగాల అయిలయ్య, బాబా, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.