జనం న్యూస్ నవంబర్ 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ సర్వే నంబర్ 18 వద్ద శుక్రవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటించి, ఇటీవల రాత్రి కురిసిన వర్షానికి స్థానిక ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించారు.ఈ ప్రాంతంలో సీవరేజ్ పైపులైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, పనులు అసంపూర్తిగా ఉండటంపై ఎమ్మెల్యే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో ప్రారంభించిన పనులను ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదని అధికారులను ప్రశ్నించారు. వెంటనే పనులను పూర్తి చేయాలని, పనులు పూర్తయ్యే వరకు వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, పనులను నిర్లక్ష్యం చేయకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పనుల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తనను సంప్రదించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్, డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.