ఆరోగ్యమే మహాభాగ్యం.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇవ్వాలి : డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి
జనం న్యూస్, అక్టోబర్ 30, జగిత్యాల జిల్లా : మెట్పల్లి మెట్పల్లిలోని ఎం.జె.పి.బి.సి.డబ్ల్యూ.ఆర్.ఎస్ (MJPBCWRS) బాలుర పాఠశాలలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వైద్యాధికారి డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత పాటించడం, మానసిక ఒత్తిడిని అధిగమించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థి దశలో చదువుపై ఒత్తిడి, ఆందోళన, భయం వంటి సమస్యలు ఎదురవడం సహజమని, వాటిని ధైర్యంగా అధిగమించేందుకు సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. ప్రతిరోజూ తగినంత నిద్ర, క్రమబద్ధమైన వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని వివరించారు.మానసిక సమస్యలు లేదా ఒత్తిడికి గురైనప్పుడు వాటిని మనసులోనే దాచుకోకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా వైద్యులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా ప్రతిరోజూ స్నానం చేయడం, భోజనానికి ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం, గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం, శుభ్రమైన దుస్తులు ధరించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి అలవాట్లను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని వివరించారు. పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక అంటువ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేపట్టారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, అవసరమైన వారికి తగిన వైద్య సలహాలు, సూచనలు అందించారు.విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకొని చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని డాక్టర్ అంజిత్ రెడ్డి సూచించారు.