కేపీహెచ్‌బీ పోలీసులు వేగవంతమైన చర్య.. ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్టు

June 17, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కేపీహెచ్‌బీ పోలీసుల చాకచక్యంతో ఏటీఎం కేంద్రాల్లో వినియోగదారుల దృష్టి మరల్చి నగదు అపహరిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర మోసగాళ్లు అరెస్టయ్యారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న కేపీహెచ్‌బీ క్రైమ్ టీం, వారిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అరెస్టైన నిందితుల్లో వడ్డే కాటమయ్య (25) అనంతపురం జిల్లాకు చెందినవాడు కాగా, ప్రస్తుతం కేపీహెచ్‌బీలోని టీఎల్‌ఆర్ డీలక్స్ మెన్స్ పీజీలో నివాసం ఉంటున్నాడు. మరో నిందితుడు పల్లపు శ్రీనివాస్ (48) కాకినాడకు చెందినవాడు. ప్రస్తుతం కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లో నివాసముంటున్నాడు. వీరిద్దరిపై గతంలోనూ పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.జైలులో ఏర్పడిన పరిచయం.. మోసాలకు బీజంజల్సాలకు అలవాటు పడిన ఈ ఇద్దరు నిందితులకు సంగారెడ్డి జైలులో పరిచయం ఏర్పడింది. అనంతరం కలిసి ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడడం ప్రారంభించారు. పల్లపు శ్రీనివాస్ బయట కాపలా కాస్తుండగా, వడ్డే కాటమయ్య ఏటీఎం యంత్రంలోని నగదు బయటకు వచ్చే భాగంలో పారదర్శక ప్లాస్టిక్ షీట్‌ను అమర్చేవాడు. దీంతో వినియోగదారుడు డబ్బు డ్రా చేసినప్పటికీ నగదు బయటకు రాకపోవడంతో, ఏటీఎం లోపమని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు.ఆ తర్వాత నిందితులు తిరిగి ఏటీఎంలోకి వెళ్లి ప్లాస్టిక్ షీట్‌ను తొలగించి అందులో చిక్కుకున్న నగదును తీసుకుని పరారయ్యేవారు. బాధితులు బ్యాంకును సంప్రదించగా, పరిశీలన అనంతరం బ్యాంకులు సంబంధిత మొత్తాన్ని వారి ఖాతాల్లో తిరిగి జమ చేసేవని పోలీసులు తెలిపారు.యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో ఘటనఈ నెల 7న కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌లోని యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. బాధితుడు రూ.5 వేల నగదు డ్రా చేయగా, యంత్రం నుంచి నగదు బయటకు రాకపోవడంతో బ్యాంకు అధికారులను ఆశ్రయించాడు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అధికారులు ఇద్దరు వ్యక్తులు మోసపూరిత చర్యలకు పాల్పడినట్లు గుర్తించి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు అందుకున్న కేపీహెచ్‌బీ క్రైమ్ టీం వెంటనే రంగంలోకి దిగి, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో విజయం సాధించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఏసీపీ రవికిరణ్ రెడ్డిఈ సందర్భంగా కేపీహెచ్‌బీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవికిరణ్ రెడ్డి మాట్లాడుతూ, ఏటీఎం కేంద్రాల్లో నగదు ఉపసంహరణ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగదు డెబిట్ అయినప్పటికీ బయటకు రాని సందర్భాల్లో వెంటనే బ్యాంకు అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఏటీఎంలలో అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేయడం ద్వారా కేపీహెచ్‌బీ పోలీసులు తమ అప్రమత్తతను, సమర్థతను మరోసారి నిరూపించుకున్నారు.

🌐 Select Language:
📰 ePaper