కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌లో పోలీస్ అవుట్‌పోస్ట్ ప్రారంభంప్రజల భద్రత, త్వరిత సేవలే లక్ష్యం : డీసీపీ రితిరాజ్
జనం న్యూస్ జూన్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : నగర ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రయాణికులకు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సేవలు అందించేందుకు కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్‌పోస్ట్‌ను కూకట్‌పల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితిరాజ్ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై నిముషాల కు జరిగిన ఈ కార్యక్రమంలో డీసీపీ రితిరాజ్ పోలీస్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించి, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ వ్యవస్థకు ఇది మరింత బలం చేకూరుస్తుందని తెలిపారు. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఉనికిని పెంచడం, ప్రజల భద్రతను మెరుగుపరచడం, అత్యవసర పరిస్థితుల్లో స్పందన సమయాన్ని తగ్గించడం, ప్రయాణికులు మరియు స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా ఈ అవుట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు డీసీపీ సుదర్శన్, ఏసీపీ నరేశ్ రెడ్డి, ఏసీపీ రవికిరణ్ రెడ్డి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, అల్లాపూర్ పోలీస్ స్టేషన్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌వోలు) పాల్గొన్నారు. అలాగే కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారులు, సిబ్బంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ప్రజల భద్రతే ప్రధాన ధ్యేయంగా కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసే దిశగా ఈ పోలీస్ అవుట్‌పోస్ట్ కీలక పాత్ర పోషించనుందని పోలీసు అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.