కోతుల దూకుడుతోనే శిలాఫలకం కూలింది..
జనం న్యూస్ ఆగస్టు 12: శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకం కూలిపోవడంపై తలెత్తిన అనుమానాలకు పంచాయతీ సిబ్బంది తెరదించారు. శిలాఫలకాన్ని ఎవరూ కూల్చలేదని, కోతులు దూకి గద్దెను ఊపడంతోనే శిలాఫలకం కిందపడిందని గ్రామ పంచాయతీ సిబ్బంది మహేందర్ విమల స్పష్టం చేశారు.శిలాఫలకం కూలిపోయిన సమయంలో తాను అక్కడే ఉన్నానని గ్రామ పంచాయతీ సిబ్బంది మహేందర్ విమల తెలిపారు. కోతులు దూకడంతో గద్దె కదిలి శిలాఫలకం కిందపడిందని పేర్కొన్నారు. దాదాపు పది రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. పంచాయతీ కార్యాలయానికి పింఛన్ కోసం వచ్చే వృద్ధులు గద్దెపై కూర్చునేందుకు వెళ్తుండటంతో అది ప్రమాదకరంగా మారకుండా గతంలోనే కర్రను ఆసరాగా పెట్టినట్లు వివరించారు. శిలాఫలకం కూలిపోవడానికి కోతుల దూకుడు తప్ప మరే కారణం లేదని ఆమె తేల్చిచెప్పారు.కాగా, పంచాయతీ కార్యదర్శి రాజారాంను వివరణ కోరగా.. తాను విధుల్లో చేరి కేవలం నాలుగు రోజులే అవుతోందని తెలిపారు. శిలాఫలకం కూలిపోయిన విషయం తనకు తెలియదని, మీడియా మిత్రులు అడిగినప్పుడు తనకు తెలిసిన మేరకు సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు. అనంతరం గ్రామపంచాయతీ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. సిబ్బంది విమల ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉందని, ఆమె చూస్తుండగానే కోతులు దూకడంతో గద్దె కూలిందని సిబ్బంది వివరించారని కార్యదర్శి తెలిపారు.దీంతో శిలాఫలకం కూలిపోవడంపై జరుగుతున్న అనుమానాలకు పంచాయతీ సిబ్బంది వివరణతో స్పష్టత వచ్చినట్లైంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కూల్చారన్న ప్రచారానికి ఆధారాలు లేవని సిబ్బంది స్పష్టం చేశారు…..