మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: ఎమ్మెల్యే సంజయ్

August 12, 2026 | తెలంగాణ

జనం న్యూస్, ఆగస్టు 12, జగిత్యాల జిల్లా : కోరుట్ల జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని కోరుట్ల పట్టణంలోని శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల, రామకృష్ణ డిగ్రీ కళాశాలలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో “నషా ముక్త్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనుకాకుండా లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని అన్నారు.ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా వినియోగం కూడా ఒక రకమైన వ్యసనంగా మారే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసుకుని చదువుపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజ సేవలో ముందుండాలని, తమ ప్రతిభతో కోరుట్లకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఎమ్మెల్యే సంజయ్ విద్యార్థులకు సూచించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు.అనంతరం విద్యార్థులందరితో సమాజానికి ఉపయోగపడే విధంగా నడుచుకుంటామని, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper