ప్రహరీ గోడ లేని ప్రాథమిక పాఠశాలపై తల్లిదండ్రులు, ప్రజల ఆగ్రహం
చిన్నారులకు అనుకోని సంఘటన జరిగితే బాధ్యత ఎవరిది?
జనం న్యూస్,ఆగస్టు 31, జగిత్యాల జిల్లా, మెట్టపల్లి: పట్టణంలోని 11వ వార్డు ప్రియదర్శిని కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాల దుస్థితిపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు విద్యనభ్యసించే పాఠశాలకు కనీస భద్రతా వసతులు లేకపోవడం, పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం, పరిసరాల్లో చెట్లు, పొదలు విపరీతంగా పెరిగి అడవిని తలపించే పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది.“ఇంకెన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటుంది..? పిల్లలు చదువుకునే పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించేందుకు ఇంతకాలం ఎందుకు పడుతోంది?” అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.పిల్లల భద్రతపై ఆందోళనపాఠశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో బయటి వ్యక్తులు, జంతువులు పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాఠశాల పరిసరాల్లో పెరిగిపోయిన చెట్లు, పొదల కారణంగా విషపురుగులు, ఇతర ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.చిన్నారులు ఆడుకునే, తిరిగే ప్రదేశం ఇంత నిర్లక్ష్యంగా ఉండటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.అనుకోని సంఘటన జరిగితే బాధ్యత ఎవరిది?పిల్లలకు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు?” అనే ప్రశ్న ఇప్పుడు తల్లిదండ్రుల్లో తీవ్రంగా వినిపిస్తోంది.పాఠశాలలో భద్రతా లోపాలకు మొత్తం బాధ్యతను కేవలం ఉపాధ్యాయులపై వేయడం సరైనదేనా? అని వారు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల భద్రత, మౌలిక వసతుల కల్పన విషయంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు సంబంధిత విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు కూడా తమ బాధ్యతను గుర్తించాలని కోరుతున్నారు.హామీలు ఎక్కడ? అభివృద్ధి ఎక్కడ?ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, ప్రియదర్శిని కాలనీలోని ఈ పాఠశాల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు.ఎన్నికల సమయంలో అభివృద్ధి హామీలు ఇచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు పాఠశాల వంటి ప్రాథమిక సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని వారు నిలదీస్తున్నారు.వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ పాఠశాల పరిస్థితిని సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాల పరిసరాల్లో పెరిగిన చెట్లు, పొదలను తొలగించి, ప్రాంగణాన్ని శుభ్రపరచడంతో పాటు పాఠశాల చుట్టూ ప్రహరీ గోడను నిర్మించి చిన్నారులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.“పిల్లలకు ఏదైనా జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారుల భద్రతతో చెలగాటం వద్దు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సమస్యను పరిష్కరించాలి” అని తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పిల్లల భద్రతకు ఎవరు బాధ్యులు?
ఈ సమస్య పరిష్కారానికి ఇంకెన్ని సంవత్సరాలు వేచి చూడాలి?ఈ ప్రశ్నలకు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు