మంత్రి పార్థసారధితో డాక్టర్ ఏలూరి మర్యాదపూర్వక భేటీ
జనం న్యూస్ ఆగస్టు 31 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) మార్కాపురం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంత్రితో భేటీ అయిన ఏలూరి, జిల్లాకు వరప్రదాయినిగా నిలిచే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రితో చర్చించారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే చారిత్రాత్మక ఘట్టమని ఏలూరి పేర్కొన్నట్లు సమాచారం. ముఖ్యంగా మార్కాపురం ప్రాంతంతో పాటు ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందే ప్రాంతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను మంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండటంతో సాగు, తాగునీటి అవసరాలు తీరడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆయన వివరించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లు, ప్రజల భాగస్వామ్యం, కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన అంశాలపై కూడా ఇరువురు చర్చించినట్లు సమాచారం. మూడు దశాబ్దాలుగా కొనసాగిన నిరీక్షణకు తెరదించుతూ వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం మార్కాపురం ప్రాంత ప్రజలకు ఎంతో సంతోషకరమైన విషయమని ఏలూరి పేర్కొన్నారు.