బోయిన్‌పల్లి వార్డ్ కార్యాలయంలో సమీక్ష సమావేశంప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాలు
జనం న్యూస్ మే 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బోయిన్‌పల్లి వార్డ్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీ డాకు నాయక్, మాజీ కార్పొరేటర్ ముద్దాం నరసింహ యాదవ్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేలా అక్కడికక్కడే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, కూకట్పల్లి నియోజకవర్గాన్ని మూడు భాగాలుగా విభజిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలను మల్కాజ్‌గిరి జోన్‌లో విలీనం చేయడం వల్ల అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడి ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.సమావేశంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు తమ ప్రాంతాల్లోని సమస్యలను వివరించారు. కోయబస్తీలో వాటర్ బోరు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విటల్ ఎన్‌క్లేవ్‌లో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. అలాగే అస్మత్‌పేట స్మశానవాటిక అభివృద్ధి, పలు ప్రాంతాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటర్ పైప్‌లైన్ల సమస్యలు, తాగునీటి ఒత్తిడి లేకపోవడం వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి కూడా వెనుకాడబోనని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, నాయకులు బలవంత రెడ్డి, మక్కల నర్సింగరావు, హరినాథ్, జంగయ్య, యాదగిరి, నరేంద్ర గౌడ్, లలిత గౌడ్, కర్రె లావణ్యతో పాటు వివిధ కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావాలని సమావేశంలో ఎమ్మెల్యే స్పష్టం చేశారు.