భారీ వర్షాలకు 15వ వార్డులో శిథిలావస్థలోని పాత భవనం కూలింది – వెంటనే స్పందించి ప్రమాదాన్ని నివారించిన కౌన్సిలర్ అరిగెల అనూష–రాకేష్
జనం న్యూస్ | జూలై 30 | జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మెట్‌పల్లి మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు చావిడి ప్రాంతంలో శిథిలావస్థకు చేరుకున్న ఓ పాత భవనం కొంత భాగం గురువారం కూలిపోయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు. అయితే భవనం పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష, అరిగెల రాకేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. భవనం ప్రమాదకర స్థితిలో ఉండటాన్ని గుర్తించి వెంటనే మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో సమన్వయం చేసి అత్యవసరంగా జేసీబీని రప్పించి, ప్రమాదానికి కారణమయ్యే అవకాశమున్న శిథిల భవనాన్ని పూర్తిగా తొలగించే చర్యలు చేపట్టించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ సందర్భంగా అరిగెల రాకేష్ మాట్లాడుతూ, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాత ఇళ్లు, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు ఎప్పుడు కూలిపోతాయో చెప్పలేని పరిస్థితి నెలకొన్నందున అలాంటి భవనాల్లో నివసిస్తున్న కుటుంబాలు కొన్ని రోజుల పాటు బంధువుల ఇళ్లలో లేదా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమని, ప్రమాదకరంగా ఉన్న భవనాలను గుర్తించి ముందస్తుగా తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.అదేవిధంగా వార్డులో ఎక్కడైనా శిథిల భవనాలు, గోడలు కూలిపోయే పరిస్థితి ఉన్నా లేదా వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తనకు లేదా మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, విద్యుత్ తీగలు, నీటితో నిండిన ప్రాంతాలు, పాత గోడల సమీపంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.స్థానికులు సకాలంలో స్పందించి ప్రమాదాన్ని నివారించిన కౌన్సిలర్ అరిగెల అనూష–రాకేష్, మున్సిపల్ అధికారులను అభినందిస్తూ, వర్షాకాలంలో ఇలాంటి చర్యలు ప్రజలకు భరోసానిస్తున్నాయని పేర్కొన్నారు.