మత్తు పదార్థాలకు, నేరాలకు యువత దూరంగా ఉండాలి

August 29, 2026 | వైరల్ వార్తలు

సీనియర్ న్యాయవాది బక్కూరి రమేష్

జనం న్యూస్, ఆగస్టు 29, జగిత్యాల జిల్లా : మెట్‌పల్లియువత మత్తు పదార్థాలకు, నేరాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సీనియర్ న్యాయవాది, మీడియేషన్ మెంబర్ బక్కూరి రమేష్ సూచించారు. మెట్‌పల్లిలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో న్యాయవాదిగా సేవలందిస్తున్న ఆయన ప్రజలకు, యువతకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా బక్కూరి రమేష్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయడంతో పాటు, వారి భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదం ఉందన్నారు. మత్తు పదార్థాలకు బానిసైన కొందరు యువత నేరాలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.అదేవిధంగా పోక్సో చట్టం, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు ప్రమాదాలు, ఇతర నేరాలకు సంబంధించిన చట్టాలు, వాటి వల్ల ఎదురయ్యే న్యాయపరమైన పరిణామాలు, శిక్షలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.పిల్లలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టం కఠిన నిబంధనలను కలిగి ఉందని, ఈ చట్టం కింద నేరాలకు పాల్పడితే తీవ్రమైన న్యాయపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించారు. చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల యువత తెలియకుండానే నేరాల్లో చిక్కుకునే అవకాశం ఉందన్నారు.యువత చెడు స్నేహాలు, మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ విద్య, ఉద్యోగం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తన, స్నేహాలు, వారి కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.సమాజంలో నేరాలు, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించి, నిబంధనలను పాటించాలని బక్కూరి రమేష్ పిలుపునిచ్చారు. యువతకు సరైన సమయంలో చట్టపరమైన అవగాహన కల్పించడం ద్వారా నేరాలను నివారించడంతో పాటు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడవచ్చని ఆయన పేర్కొన్నారు

🌐 Select Language:
📰 ePaper