యువత భవిష్యత్తుకు డ్రగ్స్ శాపం

June 16, 2026 | ఆంధ్రప్రదేశ్

అనకాపల్లిలో ఘనంగా నిర్వహించిన భారీ మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన ర్యాలీ

జనం న్యూస్ జూన్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : సమాజంలో మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించి, యువతను వ్యసనాలకు దూరం చేయడమే లక్ష్యంగా అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం మరియు జిల్లా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం (16.06.2026) ఒక అవగాహన ర్యాలీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.​జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మరియు అనకాపల్లి సబ్ డివిజన్ అదనపు ఎస్పీ ఎం.శ్రావణి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం విజయ వంతంగా జరిగింది. నేడు ఉదయం అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ, పట్టణ ప్రధాన వీధుల గుండా సాగుతూ ఫోర్ రోడ్ జంక్షన్ వరకు చేరుకుంది. ​ఈ కార్యక్రమంలో అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, టౌన్ సీఐ ప్రేమ కుమార్, సీఐలు వెంకట నారాయణ, అశోక్ కుమార్, గోవింద రావు మరియు ఎస్సై శ్రీనివాస రావు లతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది స్వయంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం నుండి ఫోర్ రోడ్ జంక్షన్ వరకు సాగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు, యువత, మరియు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్న దృశ్యాలు డ్రోన్ కెమెరాలలో అద్భుతంగా నిక్షిప్తమయ్యాయి. ర్యాలీలో పాల్గొన్న ప్రతినిధులు, పోలీస్ అధికారులు చేతుల్లో విభిన్నమైన అవగాహన బ్యానర్లను ప్రదర్శించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు.​”డ్రగ్స్ రహిత సమాజం – సంక్షేమానికి సంకేతం… డ్రగ్స్ రహిత దిశగా ఆంధ్రాప్రదేశ్… డ్రగ్స్ వద్దు.. చదువే ముద్దు అనే అనకాపల్లి జిల్లా పోలీసుల ప్రత్యేక నినాదాలతో కూడిన బ్యానర్లు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.​అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లాకు చెందిన ‘యోగాపథం’ ప్రతినిధులు కూడా ఈ ర్యాలీలో చురుగ్గా పాల్గొని, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు.​ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. మత్తు పదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని యువతకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని కోరారు. వ్యసనాల నుంచి విముక్తి పొందడానికి జిల్లా ఆసుపత్రిలోని విముక్తి కేంద్రాన్ని (టోల్ ఫ్రీ నెంబర్: 1972) సంప్రదించవచ్చని ఈ సందర్భంగా గుర్తుచేశారు.//

🌐 Select Language:
📰 ePaper