రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా.. కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

June 24, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జూన్ 24, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో ఈ రోజు మెట్‌పల్లి సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన మెట్‌పల్లి సర్కిల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యాలయంలో కల్పించిన సౌకర్యాలు, రికార్డుల నిర్వహణ, భద్రతా చర్యలు, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలను ఎస్పీ పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రేవ్ కేసులు, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. కేసుల దర్యాప్తు నిర్దేశిత ఎస్‌ఓపీ (SOP) ప్రకారం జరగాలని, దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తరచూ తనిఖీ చేస్తూ సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత సీఐలకు సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాములు, సీఐలు సురేష్ బాబు, లక్ష్మీనారాయణ, డీసీఆర్బీ ఎస్‌ఐ ప్రదీప్, ఎస్‌ఐలు కిరణ్ కుమార్, అనిల్, చిరంజీవి, నవీన్, గంగాధర్, రాజు నాయక్, రవికిరణ్, శ్రీధర్ రెడ్డి తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper