వైభవంగా అంగన్‌వాడీ ఉత్సవం. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఘన సత్కారం జనం న్యూస్, అక్టోబర్ 01,అచ్యుతాపురం :
అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలోని తులసి నగర్‌లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం అంగన్‌వాడీ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. పీలా రమాకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్,ఏపీ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ
పసిపిల్లల సమగ్ర వికాసానికి, గర్భిణులు మరియు బాలింతలకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని మహిళలు, పిల్లల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ వారి శారీరక, మానసిక వికాసానికి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. యలమంచిలి నియోజకవర్గంలో డ్రైనేజీలు, కాలువలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి, చిన్నారుల సంక్షేమానికి సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను అతిథులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, చిన్నారులు, మహిళలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.